|
కీర్తనలు Chapter24 1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. 2 ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. 3 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? 4 వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. 5 వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. 6 ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.) 7 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. 8 మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. 9 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. 10 మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.
|
|